యాదిరెడ్డిది ఆత్మహత్య కాదు..ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ప్రాణ త్యాగం-

0
136

ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు ఏం జరిగిందో మీ ముందుకు తెస్తున్నాను.

తెలంగాణ కోసం యువత ఆత్మహత్యల వైపు మళ్లుతున్న సంక్షుభిత సమయంలో నేను ఢిల్లీలో జర్న‌లిస్టుగా ఐ న్యూస్ కి ప‌ని చేస్తున్నాను. ఆ సమయంలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణ యువకుడు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దేశ రాజకీయ ఎజెండాగా మార్చేందుకు రంగారెడ్డి జిల్లా పెద్ద మంగళారం నుంచి హస్తినకు వచ్చీ మరీ యాది రెడ్డి ప్రాణత్యాగం చేసాడు. అయితే యాదిరెడ్డి శవాన్ని మాయం చేసి ఢిల్లీలోనే దహనం చేయాలని సమైక్యాంధ్ర శక్తులు కుట్రలు చేసాయి. అయితే నాతో పాటు కొంత మంది జర్నలిస్టు మిత్రులు ఆ కుట్రలను అడ్డుకున్నాము. తెలంగాణ అమరుడి శవం అనాధ కాకుండా అడ్డంపడి..యాదిరెడ్డి చేసిన గొప్ప త్యాగం వృధా పోకుండా కాపాడుకునే క్రమంలో ఢిల్లీలో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. అది తలుచుకుంటే వృత్తి ధర్మంతో పాటు ఢిల్లీలో ప్రత్యేక ఉద్యమ పోరాటం యాదికొస్తుంది.

అది తెలంగాణ ఉద్యమం గల్లి నుంచి ఢిల్లీకి మారిన 2011 సంవత్సరం. రాష్ట్రం క‌లిసి ఉండాల‌ని ఆంధ్ర‌ లీడర్లు…ప్ర‌త్య‌ేక రాష్ట్రం కావ‌ల్సిందే అని తెంగాణ లీడ‌ర్లు డీల్లీ కేంద్రంగా రాజకీయ మంతనాలు సాగిస్తుండేవారు. వ‌చ్చిన లీడ‌ర్ల‌ను ఫాలో అవుతు మారుతున్న రాజకీయ పరిణామాలను లైవ్ల ద్వారా అందచేసేవాల్లం. తెలంగాణ భావోద్వేగాలు బలంగా ఉన్న సమయం కావడంతో.. ప్రాంతాల వారిగా విడిపోయిన మ‌న‌సత్వంతో ఢిల్లీలో తెలుగు జర్నలిస్టులుగా పనిచేసే వాల్లం. తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పేందుకు యువత ఆత్మహత్యల మార్గాన్ని ఎంచుకోవడంతో చలించిన కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దపడ్డారు.

తెలంగాణ ఇవ్వ‌క‌పోతే మనుగడ సాగించలేము..తెలంగాణకు వెళ్లే పరిస్థితులు లేవు.. తెలంగాణ ఇవ్వ‌ాల్సిందే నంటూ పార్లమెంటు ఉభయ సభలను స్థంబింప చేసే వారు. ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ అంశం చుట్టు అల్లుకుపోయిన రాజకీయాల రిపోర్టింగ్ తో కాలమే తెలియకపోయేది. అలాంటి సమయంలో 20 జులై 2011 న మాకు పిడుగు లాంటి వార్త. ఒక రోజు ఉద‌యం హైద‌రాబాదు నుండి నా పీజీ క్లాస్మెట్, జర్నలిస్టు మిత్రుడు సతీష్ మంజీరా కాల్ చేసాడు. పార్ల‌మెంట్ ఎదురుగా తెలంగాణ కోసం తెలంగాణ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ట వేణు.. క‌నుక్కో అన్నాడు. ఏదన్నా ఛానెల్ లో వస్తుందా..పక్కా న్యూసా అని అడిగితే…లేదు..ఢిల్లీ పోలీసుల నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం వచ్చింది…నువ్వు న్యూస్ కన్ఫాం చేసి చెబితే న్యూస్ బ్రేక్ చేద్దాం అని సతీష్ బదులిచ్చాడు.

నేను వెంటనే..అవునా..అయితే స్పాట్ కి వెల్లి కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టెసాను. ఆ స‌మ‌యంలో నేను తుగ్లక్ రోడ్ లో కేసీఆర్ నివాసంలో ఉన్నాను. న‌మస్తే తెంగాణ‌లో రిపోర్టర్ గా ప‌నిచేస్తున్న మిత్రుడు న‌రేష్ సంకేపల్లి అక్క‌డే ఉండే వాడు. నేను వెంటనే పక్కనే ఉన్న నరేష్ తో..పార్ల‌మెంట్ ముందు తెలంగాణ యువ‌కుడు ఆత్మహత్య చేసుకున్నాడట..వెంట‌నే అక్క‌డి వెల్దాం పదా అన్నాను. అయితే ఆ స‌మయంలో కారు అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఇద్దరం నరేష్ బైక్ మీద అక్కడికి బయలు దేరాం. ప్రయాణంలోనే టీవి5 కి ఢిల్లీ జర్నలిస్టుగా పనిచేస్తున్న మరో మిత్రుడు ప్రదీప్ కు ఫోన్ చేసాను. వచ్చిన సమాచారాన్ని చేరవేసి..వెంటనే పార్లమెంట్ దగ్గరకు వచ్చేసేయ్ అన్నాను. కొద్ది సేపట్లో ముగ్గురం పార్లమెంటు దగ్గర్లో కలుసుకుని ఆత్మహత్య జరిగిన ప్రాంతం కోసం వెతకడం మొదలు పెట్టాము.

పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ఎంత తిరిగినా మాకు చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి చ‌నిపోయిన దాఖలాలు కనిపించలేదు. పరిసరాల్లోని పోలీసులు, వీధి వ్యాపారులను అడిగినా..ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదు. కాని వారి స్పందన చూస్తే మాకు అనుమానం కలిగింది. ఏదో దాస్తున్నారని మాకర్ధమయ్యింది. అందుకే ఎందుకైనా మంచిదని స్థానిక పోలిస్ స్టేష‌న్ జంత‌ర్ మంత‌ర్ కు వెళ్లాము. పార్ల‌మెంట్ ముందు ఎవ‌రో ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని పోలీసులను అడిగితే చప్పుడు చేయలేదు. దీంతో మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్ చాంబర్ లోకి దూసుకెల్లి ఆత్మహత్య గురించి గట్టిగా అడిగితే మాకు గుండే పలిగే సమాధం వచ్చింది. అవును పార్లమెంటు ముందు ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు. అత‌ను తెలంగాణ ప్రాంత‌వాసి అని చెప్పాడు. అత‌ని పేరేంటీ, అతని ద‌గ్గ‌ర ఆత్మ‌హ‌త్య చేసుకోవడానికి గల కారణాలేమైనా లభించాయా అని అడిగితే…అతని పేరు యాదిరెడ్డి అని క్లుప్తంగా చెప్పాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సుసైడ్ చేసుకున్నట్లు మృతుడి జేబులో సుసైడ్ నోట్ లభించిందని పోలీసులు పొడి పొడి గా స‌మాదానం ఇచ్చారు. సూసైడ్ నోట్ చూయించాలని పట్టుబడితే పోలీసులు నిరాకరించారు. అయితే అప్పటికే లోకల్ హింది పేపర్ ఫోటో గ్రాఫర్ సుసైడ్ లేఖను ఫోటోలు తీసాడు. దాన్ని చదివిన తర్వాత తెలంగాణ కోసమే ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారనే నిర్ధారనకొచ్చిన ముగ్గురం ఎంతో కలత చెందాం. మాకు తెలియకుండానే మా ముగ్గురి కల్లు చెమ్మగిల్లాయి.

వెంటనే తేరుకుని డెడ్ బాడి ఎక్కడికి షిఫ్ట్ చేసారు అని పోలీసులను అడిగితే …ఆర్ ఎం ఎల్ ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పారు. పోస్టుమార్టం పూర్తి చేసి హైదరాబాద్ పంపిస్తామన్నారు. మేము వెంటనే ఆ హస్పిటల్ కు వెళితే…డెడ్ బాడిని హైదరాబాద్ కు పంపించామన్నారు. గంటల వ్యవధిలో ఇది సాధ్యపడదని తెలిసి..ఇక్కడే డెడ్ బాడి ఉంది…మాకు చూపాల్సిందే అని ఆసుపత్రి సిబ్బందితో మేము ముగ్గురం కొంత గొడవ పడ్డాం. మీడియా వాళ్లతో గొడవ ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కాని ఆసుపత్రి సిబ్బంది లో ఒకరు మార్చురీలో డెడ్ బాడి ఉందని సమాచారమిచ్చాడు. వెంటనే మార్చురీకి పరుగు తీసాము.

అక్కడ ఎంతో వత్తిడి చేస్తే లోనికి అనుమతించారు. కెమెరాలను లోపటికి తీసుకెళ్లి మా వీడియో జర్నలిస్టులతో విజువల్స్ తీయించాము. వెంటనే విజువల్స్ మా ఆఫీస్ లకు పంపి లైవ్ లు మొదలు పెట్టాము. ప్రత్యేక తెలంగాణ కోసం హస్తిన వీధుల్లో యువకుడు బలిదానం చేసాడని న్యూస్ రన్ చేసాము. మేము న్యూస్ బ్రేక్ చేసిన తర్వాత మిగతా ఛానల్ ప్రతినిధులు ఒక్కొక్కరు అక్కడకు రావడం మొదలు పెట్టారు.

ఆ తరువాత కొంత మంది ఆంధ్ర జర్నలిస్టులు..యాదిరెడ్డి ఆత్మహత్య తెలంగాణ కోసం కానే కాదు అని చెప్పేందుకు ప్రయత్నం చేసారు. వ్యక్తిగత కారణాలతోనే చనిపోయాడని వాదించడం మొదలుపెట్టారు. ఒక ఆంధ్ర మిత్రుడైతే ఏకంగా మొండి వాదనకు దిగి మమ్మల్నే తప్పు బట్టాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య అని మీరేలా నిర్ధారణకు వచ్చారని….ప్రత్యేక రాష్ట్రం కోసమే బలిదానం అని లైవ్ లు ఏలా ఇస్తారని… మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని ఆవేశం తో ఊగిపోయాడు. మీలాగా నేరుగా మేము మార్చురీ దగ్గరికి రాలేదని లెగ్ వర్క్ చేసి సుసైడ్ నోట్ చదివే నిర్ధారించుకున్నామని ఘాటుగా సమాధానమివ్వడంతో మిత్రుడు చల్లబడ్డాడు. అయితే ఆత్మహత్యకు ప్రత్యేక తెలంగాణ కారణం కాదని..వేరే వ్యక్తిగత కారణాలు ఉన్నాయని ఆ లైన్ లోనే వార్త నడపాలని ఆంధ్ర జర్నలిస్టులు డిసైడ్ అయ్యారు. మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు.

కాని మేము వారి ట్రాప్ లో పడకుండా వాస్తవాలు ప్రజలకు తెలియ చేప్పే ప్రయత్నం చేసాము. అదే సమయంలో తెలంగాణ కోసం కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసేందుకు కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీ లో ఉన్నారు. తెలంగాణ జర్నలిస్టులు ఒక్కొక్కరు ఒక్కో మంత్రికి ఎంపీకి ఫోన్ చేసి సమాచారం చేర వేసారు. ఇంతలోనే ఎంపీ హనుమంతరావు అక్కడకు వస్తే మేమంతా మైకులు పెట్టి లైవ్ లు నడిపాం. తెలంగాణ కోసం పార్లమెంటు సాక్షిగా యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని హనుమంతన్న చెప్పడంతో ఆంధ్ర జర్నలిస్టు మిత్రుల నోల్లకు తాళాలు పడ్డాయి.

అంతలోనే కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ జర్నలిస్టుల నుంచి సమాచారమందుకున్న జాతీయ మీడియా ప్రతినిధులు సైతం అక్కడికి చేరుకున్నారు. దీంతో యాదిరెడ్డి మరణం దేశ వ్యాప్త వార్త కావడం..యాదిరెడ్డి డెడ్ బాడిని మంత్రులు ఎంపీలు చూసిన తర్వాత అక్కడ భావోద్వేగాలు చెలరేగడంతో సమస్యల జఠిలం కాకుండా భారి సంఖ్యలో ఢిల్లీ పోలీస్ బలగాలు అక్కడకి చేరుకున్నాయి.

తెలంగాణ కోసం ఆత్మహత్యలు ఢిల్లీకి తాకడంతో కాంగ్రెస్ అధిష్టానంలో ప్రత్యేక రాష్ట ఏర్పాటు దిశలో కదలిక మొదలయ్యింది. ఎంపీల ద్వారా సోనియా గాంధీ గారు ఎప్పటి కప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీలు , మంత్రులు తెలంగాణ ఇవ్వాల్సిందే అని పెద్ద ఎత్తున ధర్నాలు మొదలు పెట్టారు. డెడ్ బాడీ ని హైదరాబాద్ కు పంపించే ముందు ఏపీ భవన్ కు తరలించి నివాళి అర్పించాలని కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు నిర్ణయించారు. కాని ఏపీ భవన్ కు రాకుండానే నేరుగా యాదిరెడ్డి స్వస్థలానికి డెడ్ బాడిని తరలించేలా ప్లాన్ చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ భవన్ కు యాదిరెడ్డి డెడ్ బాడి వస్తే ఢిల్లీలో తెలంగాణ వాదం బలపడుతుందని..అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుందన్న భావనతో డెడ్ బాడిని ఏపీ భవన్ కు రాకుండా ఆంధ్ర ఎంపీలు వీపరీతమైన లాబియింగ్ చేసారు.

కానీ అప్పటికే ఢిల్లిలో సోనియా గాంధీ, ప్రదాని మన్మోహన్ సింగ్ లు.. యాదిరెడ్డి ఆత్మహత్యతో ఆలోచనలో పడ్డారు. పార్లమెంటు సాక్షిగా ఆత్మహత్య జరగటంతో తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో ఎప్పటికప్పుడు సోనియాగాంధీ, ప్రధాని మాట్లాడుతూ సమాచారాన్ని తెలుసుకుంటునే ఉన్నారు.

అయితే యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు పోస్టుమార్టం పూర్తి అయ్యింది. డెడ్ బాడీని ఏపీ భవన్ కు తీసుకురావాలి కాంగ్రెస్ ఎంపీలు అనుకున్నారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా రజిత్ భార్గావ్ ఉన్నారు. శాంతి భద్రతల ద్రుష్టిలో యాదిరెడ్డి డెడ్ బాడీ ని ఏపీ భవన్ కు అనుమతించబోమని భవన్ ఓ ఎస్ డి చందర్ రావ్ పేరు మీద నోట్ విడుదల అయ్యింది. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ ఎంపీలు ఏపీ భవన్ గేట్లు మూసి మేయిన్ గేట్ ముందు భైఠాయించారు. ఏపీ భవన్ ఆంధ్ర సొత్తు కాదని..అందులో తెలంగాణకు హక్కు ఉందని..అమరుడు యాదిరెడ్డి డెడ్ బాడీని రానియకుండా అవమాన పరుస్తున్నారని ధర్నా చేపట్టారు. యాదిరెడ్డి ఆత్మహత్య సమాచారంతో హైదరాబాద్ నుండి టీఆర్ ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, వినోదులు ఢిల్లీకి చేరుకున్నారు. యాదిరెడ్డి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాక .. టీఆర్ఎస్ నేతలంతా ఏపీ భవన్ వైపు వచ్చారు. అప్పటికే కాంగ్రెస్ ఎంపీలు భవన్ ముందు ధర్నా చేస్తున్నారు. అయితే ధర్నాలో పాల్గొనకుండా..కాంగ్రెస్ నేతలను దాటుకుని ఏపీ భవన్ లోనికి వచ్చారు. యాదిరెడ్డి డెడ్ బాడీని ఏపీ భవన్ లోకి అనుమతించలేమని నోట్ విడుదల చేసిన అధికారి చందర్ రావ్ పై ఆగ్రహంతో హరీష్ దాడి చేసి చెంప మీద కొట్టారు. కాలితో తన్నాడు. దీంతో ఒక్క సారిగా పరిస్థితులు మారాయి.

అప్పటి వరకు వేడి మీదున్న యాదిరెడ్డి ఆత్మహత్య అంశం పక్కదారి పట్టింది. చందర్ రావు పై దాడికి నిరసనగా ఏపీ భవన్ ఉద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. ఆంధ్ర మీడియా ఉద్యోగుల ధర్నాకు వీపరీతమైన ప్రధాన్యతనిచ్చి అమరుడి త్యాగాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఏపీ భవన్ లో తెలంగాణ ఉద్యోగులు ఇద్దరే పనిచేస్తుండటంతో యాదిరెడ్డి ఆత్మహత్య కన్నా చందర్ రావు పై దాడే పెద్ద వార్త అయ్యింది. దీన్ని ప్రశ్నించిన పాపానికి ఏపీ భవన్ ఉద్యోగులు మా పై దాడికి యత్నిస్తే మేము ధైర్యంగా తిప్పికొట్టాము. అప్పటి వరకు అన్నదమ్ములా వృత్తిధ‌ర్మం నిర్వర్తించిన మేము..ప్రాంతాలుగా విడిపోవాల్సి వచ్చింది. అది భాదగా ఉన్నా ప్రత్యేక రాష్ట్రం కోసం వ్యక్తిగత బంధాలు అనుబంధాలను కాదనుకుని తెలంగాణ వాదాన్ని నిలబెట్టేందుకు పరితపించాం. ఇక చందర్ రావ్ దళిత్ కావడంతో..ఆయనపై దాడి చేసిన హరిశ్ రావు పై అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఈ పరిణామాలన్ని జరుగుతున్న సమయంలో..ఆర్ఎంఎల్ హస్పిటల్ నుంచి యాదిరెడ్డి డెడ్ బాడీతో ఓ అంబులెన్స్ ఏపీ భవన్ కు బయలు దేరింది. ముందు వెనకాల వస్తున్న ఎంపీల కార్లను చాకచక్యంగా తప్పించి..అంబులెన్స్ ను ఎయిర్ పోర్టు కు బలప్రయోగంతో పంపించారు పోలీసులు. ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో యాది రెడ్డి డెడ్ బాడీ ని హైదరాబాద్ కు తరలించారు. అయితే యాది రెడ్డి ఆత్మ హత్య ఢిల్లీ పెద్దలను కదలించింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వడానికి చొదక శక్తిగా పని చేసింది. అందరిని ఒప్పించి మెప్పించే ప్రక్రియలో కాస్త జాప్యం జరిగినా..ఢిల్లీలో తెలంగాణ యువకుడు యాదిరెడ్డి చేసిన బలిదానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించింది. అయితే యాదిరెడ్డి ది ఆత్మహత్య కాదు..ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన త్యాగమన్న విషయాన్ని వెలికి తీయడంతో నాతో పాటు తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీలో చేసిన పోరాటం నిజంగా మరవలేనిది. మరుపు రానిది..
జోహర్ తెలంగాణ అమర వీరులకు..

By Bodanapally Venugopal Reddy, Sr.Journalist . Telangana journalistula adhyayana vedika state prasident.