టీచర్లకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం వెయ్యి వరకు ఎస్ఏ పోస్టులను గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. దీనితో వారికి ప్రమోషన్లు దక్కనున్నాయి.
అయితే ఈ ప్రమోషన్లను సీనియార్టీ ప్రాతిపదికన ఎస్ఏలకు ఇవ్వనున్నారు. పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ ఈ పదోన్నతుల విధివిధానాలను సర్క్యులర్ రూపంలో విడుదల చేశారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా సీనియార్టీ జాబితాలను ఈనెల 10వ లోగా రూపొందించాలని రీజినల్ జాయింట్డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు జోన్, జిల్లాల ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీని గుర్తించేటప్పుడు ఏపీఎస్ఎస్ఎస్–1996లోని 33, 34 నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే ఏపీ సబార్డినేట్ సర్వీస్ నిబంధన రూల్ 22 పాటించాలి. టీచర్ల సీనియార్టీకి పోస్టులో చేరిన తేదీని పరిగణలోకి తీసుకోవడంతో పాటు క్రమబద్ధీకరణ, ప్రొబేషన్ పీరియడ్ ఆమోదం ఆధారంగా చేపట్టాల్సి ఉంటుంది.