ఎగరవేసిన జెండాలను ఏం చేయాలి?..జాతీయ పతాక నియమావళి ఏం చెబుతుందంటే..

0
208

జాతీయ జెండా ఎగరవేయాలన్నా, తీసివేయాలన్న ఎన్నో నియమాలు పాటించాలి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. ఇక నిన్న తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. అలాగే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ జెండాలను ఏం చేయాలనీ నగర వాసులలో ఆ నిబంధనల అమలుపై ఆందోళన నెలకొంది.

జాతీయ పతాక నియమావళిలో జులై 20, 2022న కేంద్ర సర్కారు పలు సవరణలు చేసింది. వాటి ప్రకారం పగలు, రాత్రి తేడా లేకుండా ఎన్ని రోజులైనా జాతీయ పతాకాన్ని పౌరులు ఎగురవేయొచ్ఛు గౌరవభావంతో, జెండాకు ఎలాంటి అవమానం కలగకుండా, చిరిగిన స్థితిలో జెండాను ఎగరవేయకుండా, ఇతరత్రా నియమాలను అనుసరించడం మాత్రం తప్పనిసరి. జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటాయి.

అలాగే.. ఎగరేసిన జెండాను ఎలా దించాలి, దించాక ఏం చేయాలి, ఇంట్లో భద్రపరచలేని పరిస్థితిలో పౌరుడు ఆ జెండాను ఎలా విసర్జనం చేయాలనే నిబంధనలు సైతం నియమావళిలో ఉన్నాయి. జాతీయ పతాకాన్ని ధ్వజ స్తంభం నుంచి దించాక.. పద్ధతి ప్రకారం తప్పనిసరిగా మడతపెట్టాలి. ఇలా మడత పెట్టిన జెండాను ఇంట్లో గౌరవంగా భద్రపరచవచ్ఛు లేదా గోప్యంగా భూమిలో పాతి పెట్టడం, నిప్పులో కాల్చడం ద్వారా విసర్జనం చేయొచ్చు.