క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. సాధారణంగా క్రికెట్ ప్రియులు అన్ని మ్యాచ్ లను చూస్తుంటారు. అయితే భారత్, పాక్ మ్యాచ్ అంటే మాత్రం ఆ కిక్కే వేరు. ఎవరైనా ఆ మ్యాచ్ ను ప్రత్యేక్షంగా చూడాలని కోరుకుంటారు. అయితే తాజాగా ఆసీస్ వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో మరోసారి భారత్- పాకిస్థాన్ కలిసి ఆడనున్నాయి.
తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి ఫిబ్రవరిలో టికెట్లు విడుదల చేయగా.. కేవలం ఐదు నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో 4వేలకుపైగా స్టాండింగ్ రూమ్ టికెట్లను విడుదల చేసింది. ఒక్కో టికెట్ 30 ఆస్ట్రేలియన్ డాలర్లకు (దాదాపు రూ.1670) ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్ పద్ధతిలో కేటాయిస్తామని ఐసీసీ వెల్లడించింది.
“భారత్, పాక్ మ్యాచ్ చూసేందుకు మరింత మంది అభిమానులకు అవకాశం కల్పించడానికి 4వేలకుపైగా స్టాండింగ్ రూమ్ టికెట్లను కేటాయించాం. అక్టోబర్ 23న (ఆదివారం) దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐసీసీ హాస్పిటాలిటీ, ఐసీసీ ట్రావెల్స్ అండ్ టూర్స్ ప్రోగ్రామ్స్ తరఫున పరిమిత సంఖ్యలో ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తెచ్చాం. టీ20 ప్రపంచకప్‌లో ఇతర దేశాల అత్యుత్తమ క్రికెటర్లను వీక్షించేందుకు అన్ని మ్యాచ్‌ల టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పిల్లలకు 5 ఆస్ట్రేలియన్ డాలర్లు, పెద్దలకు 20 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ 13న జరిగే మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి” అని ఐసీసీ ప్రతినిధులు వెల్లడించారు.