నేడు దేశం దృష్టి మొత్తం నోయిడాలోని ట్విన్ టవర్స్ పైనే ఉంది. నేడు మధ్యాహ్నం జంట టవర్లను నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తుల భారీ భవంతులను కేవలం 10 నుంచి 13 సెకన్లలో నేలమట్టం చేయనున్నారు.
మరి అంత పెద్ద బిల్డింగ్‌ను ఎందుకు కూల్చేస్తున్నారనేగా సందేహం. నొయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ట్విన్ టవర్స్‌ను నిర్మించింది. 2009లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు చెప్పింది.
తొమ్మిదేళ్లుగా పనులు కొనసాగిన ఈ టవర్స్ నిర్మాణానికి నిర్మాణ సంస్థ రూ.10 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ టవర్స్ ను కూల్చివేసేందుకు రూ.20 కోట్లు ఖర్చవుతుంది. వీటిని కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. కూల్చివేత తర్వాత 80,000 టన్నుల వ్యర్ధాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిలో 50,000 టన్నుల వ్యర్ధాలను ఈ జంట భవనాలు ఉన్న ప్రాంతంలోనే భారీ గోతిలో నిర్వీర్యం చేసేందుకు ఏర్పాట్లు చేయగా, మిగిలిన 30 వేల టన్నుల వ్యర్ధాలను వేరే చోటకు తరలించి, సాంకేతికంగా ప్రాసెస్ చేయించి వాటి నుంచి టైల్స్ తయారు చేయనున్నారు.