బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల ధర్నా..స్పందించని అధికారులు..భారీగా ట్రాఫిక్ జామ్

0
99

యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి రోడ్డున పడడం కాదు. ఓ కుటుంబమే రోడ్డున పడడం. ఈ రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్తే తిరిగి ఇంటికొచ్చే వరకు కుటుంబీకులు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా వంగూరు మండలం కిష్టంపల్లి తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబానికి పెద్ద దిక్కును లేకుండా చేసింది. ఈ ప్రమాదంలో కారు- మోటార్ సైకిల్ ఢీ కొనగా..వెలుమలపల్లి TRS గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డమీది మల్లేష్ 36 సం. మరణించారు.

ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. గడ్డమీది మల్లేష్ మృతితో బంధువులు, స్నేహితులు రోదనలు మిన్నంటాయి. దేవుడా ఎంత పని చేశావయ్య.. ఇలాంటి చేదు వార్త వింటామని అస్సలు ఊహించలేదని మల్లేష్ మిత్రులు కంటతడి పెట్టారు. అలాగే మల్లేష్ తో తమ జ్ణాపకాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య మల్లేష్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్లు గెట్ టు గెదర్ పార్టీని మల్లేష్ వ్యవసాయ క్షేత్రంలోనే చేసుకున్నామని నెమరు వేసుకున్నారు. మల్లేష్ తో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, మల్లేష్ ఎప్పుడు తమ మనసులోనే ఉంటాడని చెప్పుకొచ్చారు. మల్లేష్ మృతితో బంధువులు, మిత్రులు, గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి ప్రమాదం మరెవరికి జరగకూడదని మల్లేష్ మిత్రులు బోరున విలపించారు.

ఇక తాజాగా గడ్డమీది మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలని బాధిత కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. దీనితో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ ఘటనపై అటు పోలీసులు గాని, ఇటు అధికారులు గాని స్పందించకపోవడం విడ్డూరం. మృతదేహం పోస్టుమార్టం కూడా పూర్తి కాగా న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారులను అడిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అని బుకాయిస్తున్నారు. జోరు వానను కూడా లెక్క చేయకుండా బాధిత కుటుంబానికి మల్లేష్ మిత్రులు, బంధువులు మద్దతుగా నిలుస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేదే లేదని భీష్మించుకు కూర్చుకున్నారు.

గడ్డమీది మల్లేష్ ఫోటో