తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో 2 గంటల 30 నిమిషాలకు నిజామాబాద్ చేరుకోనున్న కేసీఆర్.. తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. పూజల అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డిని సీటులో కూర్చోపెట్టనున్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభకు సంబంధించి పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు.
మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా ప్రణాళికలు అమలుచేస్తున్నారు. మంత్రివర్గం, సీఎల్పీ సమావేశాల తర్వాత పాల్గొంటున్న సభ కావడంతో ముఖ్యమంత్రి ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ వస్తుడంటంతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిజామాబాద్ గులాబీమయంగా మారింది.