సాధారణంగా కారు కొనాలని ఎవరు మాత్రం కోరుకోరు. కాకపోతే వారి ఆదాయాన్ని బట్టి కారు ఎంపిక చేసుకుంటారు. అయితే ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఇప్పుడు కారు ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చేస్తున్నారు.
బడ్జెట్
దేశీయంగా కార్ల కొనుగోలులో బడ్జెట్ కీలకం. ఖరీదైన, విలాసవంత కార్లు అన్ని రకాల సౌకర్యాలతో పాటు, ఎయిర్‌బ్యాగ్‌లతో సురక్షితమనే నమ్మకం ఉంది. అందుకే, ప్రముఖులు, వ్యాపారవేత్తలు తమ ప్రయాణాలకు వీటినే ఉపయోగిస్తుంటారు. మధ్యతరగతి, ఉన్నత మధ్య తరగతి వర్గీయుల కొనుగోళ్లలో ఇదివరకు ధరే కీలకం అయ్యేది.
వెనుక కూర్చున్న వారికీ భద్రత ఇలా..
ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉన్న బెంజ్ జీఎల్‌సీ స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్‌యూవీ)లో వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ, ఆదివారం నాటి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెనుక సీటులో కూర్చున్న వారు కూడా సీటు బెల్టు తప్పనిసరిగా వినియోగించాలని, వెనుక సీటులో కూర్చున్న వారికీ భద్రత కల్పించేలా..వారి ముందువైపునా ఎయిర్‌బ్యాగ్ ఉండాలనే చర్చ మొదలైంది.
6 ఎయిర్‌బ్యాగ్‌లతో..
మన దేశంలో 2019 జులై నుంచి డ్రైవర్ సీటుకు ఎయిర్‌బ్యాగ్‌ను అన్ని కార్లకూ తప్పనిసరి చేశారు. 2021 ఏప్రిల్ నుంచి డ్రైవర్‌తో పాటు, ముందు సీటులో కూర్చునే ప్రయాణికుడికీ ఎయిర్‌బ్యాగ్ ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. అంటే ప్రతి కారుకూ రెండు ఎయిర్ బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ఇండికేటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
8 మందిలోపు ప్రయాణించే కార్లకు తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని గత ఏడాదే కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి దీన్ని తప్పనిసరి చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. చాలావరకు పెద్ద కార్లు 7-8 ఎయిర్‌బ్యాగులతో వస్తున్నాయి. మధ్యస్థాయి, ఎస్‌యూవీల్లోనూ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులు ఉంటున్నాయి.