వందల సంవత్సరాల నుంచి అధికారం చెలాయిస్తున్న బ్రిటీషర్లకు శాంతియుత మార్గంలో ఎదురొడ్డి గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ శాంతికి పాటుపడుతున్న నెల్సన్ మండేలా వంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని అన్నారు. గాంధీ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ బాక్రానంగళ్ నుంచి నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవానికి నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి పునాదులు వేశారని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ అని అన్నారు. బీజేపీని దేశం నుంచి కూకటి వేళ్లతో సహా పెకిలించాలని రేవంత్ పిలుపునిచ్చారు. విభజించు పాలించు అనే బ్రిటీషర్ల నినాదంతోనే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర దేశాన్ని ఏకీకృతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భారత్ జోడో యాత్ర ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, దండి యాత్ర స్ఫూర్తిని మళ్లీ నింపుతుందని రేవంత్ అన్నారు.