హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే అంటూ చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్ మరింత అగ్గిరాజేసింది. నాగబాబు ట్వీట్‌పై బ్రాహ్మణ సంఘాలు స్పందించాయి. నాగబాబు వ్యాఖ్యలకు ఆలిండియా బ్రహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ కొంచెం ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం, నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాదికి, సమాజంతో నటనా వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయటం లాంటిదే.. చిడతలు కొట్టేవాడు కూడా సంగీత విద్వాంసులమని ట్వీట్లలో కూనిరాగాలాపన చేస్తే ఎలా అంటూ పేరు ప్రస్తావించకుండా కౌంటర్ ట్వీట్ చేశారు. కాగా, తమ అభిమాన హీరోను కించపరిచే విధంగా మాట్లాడిన గరికపాటి తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి అభిమాన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే, గరికపాటి అవధానం, ప్రవచనాల కార్యక్రమాలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.