హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సీఐగా పని చేస్తున్న నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తుపాకీతో బెదిరించి కిడ్నాప్, అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే తెలంగాణ పోలీసుశాఖ నియామక నిబంధనలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2) బి సర్వీస్ రిమూవల్ ప్రకారం ఎటువంటి విచారణ లేకుండా నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆఫీస్ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై వచ్చిన నేరారోపణలను విచారణ జరపడం సాధ్యం కాదని.. విచారణ నిర్వహిస్తే సాక్షులు, బాధితులను నాగేశ్వరరావు బెదిరింపులకు గురి చేసే అవకాశం ఉందని పోలీసుశాఖ ఉత్తర్వుల్లో వివరించింది. మరోవైపు, విచారణకు చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో నాగేశ్వరరావు బాధితులను, సాక్షులను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ జరపకుండా సర్వీసు నుంచి తొలగించడమే సరైన శిక్ష అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.