Fitness: కరోనా మహమ్మారి వలన వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందని ఆనందపడాలో.. అప్పటి నుంచి మెుదలయ్యి ఇప్పటికీ బరువు పెరగుతూనే ఉన్నామని బాధపడాలో అర్థం కావటం లేదు కదా. హాయ్‌గా కోరుకున్నది పని చేసే దగ్గరకే రావటం, ఆవురావురమంటూ ఎంత తింటున్నామో చూసుకోకపోవటం, నోటికి రుచిగా ఉందని రెండు ముద్దలు ఎక్స్ట్రా తినటంతో వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు బరువు పెరగటంతో పాటు ఆకృతిలో మార్పులు రానే వచ్చేశాయి. ఇంట్లో ఉన్న రన్నింగ్ షూ చూసిన ప్రతిసారీ.. మారిన శరీర ఆకృతిని చూసుకొని, రేపటి నుంచి పక్కా ఉదయాన్నే పరిగెత్తాల్సిందే అనుకోవటం.. అది అలా అలా రేపు, రేపు అంటూ వాయిదా పడటం పరిపాటిగా మారిపోయింది.
బయట నడక, పరుగుతో పాటు ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే, త్వరగా ఫిట్‌నెస్(Fitness) సాధించవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం రండి.. బరువు తగ్గించటం అన్నమాట వస్తే, అందరి నోటా వినిపించేది గ్రీన్ టీ. ఎందుకంటే గ్రీన్ టీలో కేటెచిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో సహాయపడతాయి. పైగా మారిన జీవక్రియను పెంచటానికి ఓ గాడిలో పెట్టడానికి సహాయపడతాయి. ఒకవేళ మీరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గ్రీన్ టీని సేవిస్తుంటే.. అప్పుడు కూడా కేలరీలు బర్న్ అవుతాయని ఓ అధ్యయనంలో తేలింది.
గ్రీన్ టీ తరువాత దాని స్థానంలో నిలబడేది బ్లాక్ టీ. బ్లాక్ టీ తాగటం వల్ల వచ్చే ఏకైక ప్రయోజనం బ్లాకీ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రక్రియ. ఇది రక్తపోటుపై అధిక కొవ్వు ప్రభావాన్ని రద్దు చేయటంలో సహాయపడుతుంది. ఇది గుండెకు ఎంతో మంచిది.
బరువు తగ్గి, మంచి ఫిట్‌నెస్(Fitness) సాధించటానికి బీన్స్‌ను మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. బీన్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువుగా ఉంటాయి. బీన్స్‌లోని కెంప్‌ఫెరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్, క్రానిక్ ఇన్‌ప్లమేషన్‌ను అరికడుతుంది. బీన్స్ పేగు కదలికలను సమర్థవంతంగా నియంత్రించటంలో సహాయపడతాయి.
బ్లూ బెర్రీస్ సైతం వయస్సు సంబంధిత మెదడు నష్టాన్ని తగ్గిస్తాయి. అంతేగాకుండా, బ్లూబెర్రీస్‌ను తీసుకోవటం ద్వారా, రక్తపోటు నియంత్రణంలో ఉండటంతో తక్కువ సాంద్రత ఉండే లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో సాయపడుతుంది. వెజిటేబుల్ జ్యూస్‌లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. తాజా కూరగాయలను రసాలుగా చేసుకొని తాగటం ద్వారా, ఎక్కువ ఆకలి అనిపించదు. దీని వల్ల ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోకపోవటంతో పాటు, ఆకలి సైతం నియంత్రణలోకి వస్తుంది. బీట్‌రూట్, క్యారెట్, టొమాటో, గూస్‌బెర్రీ వంటి వాటిని రసాలుగా చేసుకొని డైలీ తాగండి.. ఆహారాన్ని మితంగా తీసుకొని మీ శరీర బరువును కాపాడుకోండి.