pawan kalyan: నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్.. అక్కడ నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదగా.. నోవాటెల్ హోటల్‌కి చేరుకోనున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకున్న అనంతరం, సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించనున్నారు. అదే రోజున శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశం అవుతారు. సోమవారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరం, విజయనగరం పార్టీ నేతలతో సమావేశం అవుతారు. రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, కార్యచరణలపై పవన్ (pawan kalyan) దిశానిర్దేశం చేయనున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు విశాఖలో విశాఖ గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్న రోజనే, పవన్ సైతం జనవాణి కార్యక్రమం నిర్వహించటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా ఈ విషయంపై వైసీపీ నేతలు, జనసేన నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలో వందల మంది పోలీసు బలగాలు మెహరించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.