Hair fall :జుట్టు ఊడిపోతుందంటే చాలు.. కంగారు పడిపోవటం. ఇంటర్నెట్‌లో బెస్ట్ షాంపూ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అని సెర్చ్ చేయటం, వాడటం పరిపాటిగా మారిపోయింది. ఎంత డబ్బు పెట్టి కొన్నా, జుట్టు ఊడటం( Hair fall) తగ్గకపోగా, మరింత ఊడిపోవటంతో ఆందోళన చెందటం. ముందు గాభరా పడటం ఆపేసి.. జుట్టు ఊడకుండా, ఒత్తుగా పెరగేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.. కచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
వేడి వేడి నీళ్లతో తలకు స్నానం చేయటం వల్ల కుదుళ్లు బలహీనం అయిపోతాయి. వేడినీళ్ల వల్ల కుదుళ్లపై ఒత్తిడి పెరగటం, మాడుపై తేమ మెుత్తం తొలగిపోవటం జరుగుతుంది. దీంతో క్రమంగా జుట్టు ఊడటం (Hair fall) మెుదలవుతుంది. అలా కాకుండా కేవలం గోరువెచ్చని నీరుతో తలకు స్నానం చేస్తే ఇబ్బందులు రావు. కేవలం చలికాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా సరే గోరు వెచ్చని నీటితో స్నానం చేయటం ఉత్తమం.
కొందిమంది అస్సలు తలకు నూనె రాయరు. అదేదో పాతకాలం నాటిదని కొట్టి పారేస్తారు. కానీ, నూనె రాయటం వలన జుట్టుకు సరైన స్థాయిలో తేమ అందుతుంది. దీనివల్ల జుట్టు రాలటం తగ్గుతుంది. నూనె రాయటం వల్ల పోషకాలు అందటంతో పాటు, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నూనెతో కుదుళ్లను మసాజ్ చేస్తే.. కేశాలు ఊడటం తగ్గుతాయి.
తలకు స్నానం చేసిన వెంటనే దువ్వెనతో దువ్వకుండా, ఆరే వరకు ఆగాలి. తలకు స్నానం చేయటం వల్ల కుదుళ్లు సున్నితంగా తయారవుతాయి. ఏమాత్రం ఒత్తడి చేసినా, జుట్టు ఊడిపోతుంది. అందువల్ల జుట్టు ఆరే వరకు దువ్వకూడదు. ఎక్కువ ఖరీదు చేసే షాంపూలు వాడటం కంటే, మన జుట్టుకు ఏ షాంపూ పడుతుందో చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు చేసి షాంపూలు కొన్నా, మన జుట్టు రకానికి ఆ షాంపూ పడకపోతే.. ఇబ్బందులు తప్పవు.