Cm KCR: ఢిల్లీ బ్రోకర్‌లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టినట్టారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులోని బంగారిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపారు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని నిరూపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో వచ్చి చంచల్‌గూడ జైల్‌లో ఉన్నారు. వారికి వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో విచారణలో తేలాలి. దీని వెనక ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీళ్లేదు.
బీజేపీ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తోంది. దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా. రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు? ప్రజలు మోడీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి. దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు ప్రధాని మోడీ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోడీ. కేంద్రానికి బుద్ధిరావాలంటే చేనేత కుటుంబాలు బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. చేనేత కార్మికులు మోడీకి తగిన బుద్ధి చెప్పాలి.
అవసరం లేకుండా మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. మునుగోడు ఫలితాలను ప్రజలు ఎప్పుడో తేల్చేశారు. ప్రజలు ఆలోచించుకుని ఓట్లు వేయాలి. ఒళ్లు మర్చిపోయి ఓటేస్తే ఇల్లు కాలిపోతుంది. దోపిడీదారులు మాయమాటలు చెబుతూనే ఉంటారు. అలా అని కరిసే పామును మెడలో వేసుకుంటామా?. తెలంగాణ లాగానే దేశాన్ని అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ పుట్టుకొస్తోంది. ఇది మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. దేశ రాజకీయాలను మలుపుతిప్పే సువర్ణావకాశం. మునుగోడు విజయం బీఆర్ఎస్‌కు పునాదిగా మారుతుంది. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట నాకు అండగా నిలిచింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు మునుగోడు ప్రజలు అవకాశం ఇవ్వాలి’’ అని కేసీఆర్ (Cm KCR) కోరారు.