IT Raids: మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. తాజాగా మంత్రి జగదీష్ పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఆదాయపన్న శాఖ అధికారులు దాడులు చేశారు. నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల బృందం సోదాలు చేస్తున్నారు. కాగా ఆదాయపన్ను అధికారులు భారీ మెుత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారో అన్న వివరాలు బయటకు రానీయటం లేదు.
మునుగోడు ఉపఎన్నికను తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితంతోనే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల భవిత్యం ఆధారపడి ఉంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అందులో భాగంగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు ప్రవాహంలా వెదజల్లుతున్న విషయం తెలిసిందే…
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ డ్రైవర్ భారీ నగదుతో పట్టుబడ్డాడు. అనంతరం ఇప్పుడు, మునుగోడు ఉప ఎన్నిక భారాన్ని తన భుజాలపైకి ఎత్తుకున్న మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు (IT Raids)జరిగాయి. ఇటీవలే మంత్రిపై ఈసీ 48 గంటల పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలకు హాజరు కావొద్దని స్పష్టం చేసింది. మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆ నిబంధన ఇలా ముగిసిందో లేదో.. ఇప్పుడు ఐటీ దాడులు జరగటం ఆలోచించాల్సిన విషయమేనని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. బీజేపీ గెలుపు కోసం కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టీఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Read also: బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు