Munugode: ప్రచార హోరు లేదు. ప్రత్యర్థుల మాటలు లేవు. అభ్యర్థుల గొప్పలు వివరించే పాటలు లేవు.. మునుగోడు ఇప్పుడు మూగబోయింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార సమయం ముగియటంతో.. ప్రచారం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు కాకుండా అనధికర వ్యక్తులందరూ.. ఆయా ప్రాంతాలను సాయంత్రం ఆరు గంటల తరువాత మునుగోడు(Munugode)లో ఉండటానికి వీలులేదని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా వేదికగా అయినా ప్రచారం నిలిపివేయాలని హెచ్చరించారు.
బల్క్ మేసేజ్, ఫోన్ ఆటోమేటెడ్ క్యాంపెయిన్‌పై నిషేధం ఉన్నట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో బయట వ్యక్తుల సంఖ్యను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలు నియమించినట్లు వివరించారు. నగదు పంపిణీ, ఇతర ప్రేరణలను పర్యవేక్షిస్తాయని అన్నారు. క్విక్ రెస్పాన్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, సెక్టార్ టీంలు, పోలింగ్ స్టేషన్ల భద్రతకు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల కోడ్‌ను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించింది ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.
Read also: Rahul Gandhi: బీజేపీని పార్లమెంటులో టీఆర్‌ఎస్ సమర్థించింది