Kunamnen sambasiva rao about Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం పార్టీలు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. దేశం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మోదీని ఎదిరించే శక్తి, ధైర్యం రెండు కేసీఆర్‌కే ఉన్నాయని కొనియాడారు. బీజేపీని ఓడించాలనే కృతనిశ్చయంతోనే టీఆర్ఎస్‌కు మద్దతిచ్చామని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని.. కేసీఆర్ చొరవతోనే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమైందన్నారు.
అయితే.. 11 రౌండ్లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7,235, బీజేపీకి 5,877 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్ 5,774 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కాగా.. 11రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షా 70వేల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు చేసుకుంటున్నారు. బాణసంచా పేల్చి, నృత్యాలు చేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.డప్పు మోతలతో తెలంగాణ భవన్ ప్రాంతం గులాబీ మయంగా మారింది.