MP Komatireddy venkat reddy on his Show Cause Notices from Congress: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు రెండు రోజుల క్రితమే రిప్లై ఇచ్చినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. తాను రిప్లై ఇచ్చినా.. తారిక్ అన్వర్ అందుబాటులో లేనందునే ఇంకా ఎటువంటి విషయం వెల్లడి కాలేదని అన్నారు. ప్రస్తుతం తన నియోజకవర్గ పనుల కోసం శ్రమిస్తున్నట్లు వివరించారు.
అధిష్టానం నుంచి క్లీన్ చీట్ వచ్చినప్పుడే.. జోడో యాత్రలో పాల్గొంటానని కోమటిరెడ్డి ప్రకటించారు. షోకాజ్ నోటీసులు ఇస్తే.. పాదయాత్రలో ఎలా పాల్గొంటానంటూ ప్రశ్నించారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలో తన సోదరుడికి లబ్ధి పొందేలా.. కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చెయ్యలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్ల కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ వెంకట్ రెడ్డి చెప్తున్నా.. నేడో, రేపో అధిష్టానం ఆయనపై వేటు వేసే అవకాశం ఉంది. మరి వెంకట్ రెడ్డి ఇచ్చిన వివరణతో కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తి చెందుతుందా.. లేదా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.