Nalini Sriharan request Tamilnadu Govt to Release her Husband: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఆరుగురిని సుప్రీం కోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. వారిలో నళిని శ్రీహరన్ ఒకరు. కాగా, నళిని తమిళనాడు వెల్లురూ జైలు నుంచి గత వారమే విడుదల అయ్యింది. అయితే ఆమెతో పాటు ఉన్న నలుగురు శ్రీలంక పౌరులు చట్టవిరుద్ధంగా భారత్‌లో ఉన్నందున, జైలు నుంచి విడుదలైనా.. తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. దీని కారణంగా నళిని (Nalini Sriharan) తన భర్తను కలవలేకపోయింది. దీంతో శ్రీలంక పౌరులను విడుదల చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నళిని విజ్ఞప్తి చేసింది.
తాను తన భర్తను కలవలేకపోతున్నాననీ.. అందువల్లే ఇన్నేళ్ల తరువాత విడుదలయ్యి బయట ప్రపంచంలోకి వచ్చినా సంతోషంగా లేనని నళిని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తమిళనాడు సర్కారును వేడుకుంది. తమది కాంగ్రెస్ కుటుంబం అనీ.. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు తమ కుటుంబం బాధతో భోజనం కూడా చేయలేదని గుర్తు చేసుకున్నారు. అటువంటిది గాంధీ హత్య కేసులో తన పేరు ఉండటాన్ని జీర్ణించుకోలపోతున్నా.. ఈ నింద నుంచి నాకు విముక్తి కావాలి అంటూ నళిని కన్నీటి పర్యంతం అయ్యారు. తాను జైలులో ఉన్నప్పుడు రెండు నెలల గర్భవతి అనీ.. అప్పటికీ మరణ శిక్ష పడాలనీ, తమ విడుదలను వ్యతిరేకించారని నళిని ఆవేదన వ్యక్తం చేశారు.