How to prepare vegetable kichidi recipe: రాత్రిళ్ళు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఏదైనా వేడివేడిగా చేసుకుని తింటే బాగుండు అనిపిస్తుంటుంది మనకి. అలాంటప్పుడు ఎక్కువసేపు ఆలోచించకుండా సింపుల్ గా చేసుకోదగిన కిచిడీకి ఓటేసేయొచ్చు. రుచికి రుచితోపాటు పోషకాలు కూడా మెండుగా లభిస్తాయి. కిచిడీలో బియ్యం, పప్పుల నుంచి పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, పీచు మెండుగా లభిస్తాయి. త్వరగా జీర్ణమవడమే కాకుండా పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఒంట్లో బాగోలేనప్పుడు దీన్ని తినమని చెబుతారు.
అంతేకాదు కొంతమంది పిల్లలు అన్నిరకాల కూరలు తినడానికి ఇష్టపడరు. కానీ అన్ని కూరలు తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అలాంటి పిల్లల కోసం ఎక్కువ రకాల కూరగాయలు వేసి ఈ కిచిడీ చేసిపెట్టేయొచ్చు. ఇలా చేసిపెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇప్పుడు కిచిడీ తయారీవిధానం ఎలానో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
బియ్యం- రెండు కప్పులు
పెసర పప్పు-కప్పు
టొమాటో ముక్కలు-అరకప్పు
పసుపు-చిటికెడు
క్యారెట్ తురుము – అరకప్పు
బఠాణీ – అరకప్పు
పచ్చిమిర్చి-ఐదు
జీలకర్ర- చెంచా
గరం మసాలా- అరచెంచా
నూనె-తగినంత
ఉప్పు-రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం: ముందుగా బియ్యం, పప్పును కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోయాలి. అది కాగిన తర్వాత జీలకర్ర, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, బఠాణీ, క్యారెట్ తురుము కూడా వేసి మరోసారి బాగా కలపాలి. కాస్త వేగిన తర్వాత నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు, గరం మసాలా వేయాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పు, బియ్యం మిశ్రమాన్ని వేసి ఓసారి కలిపి మూత పెట్టాలి. చిన్నమంట మీద పదిహేను నిమిషాలపాటు ఉడికించాలి. మొత్తం నీళ్లన్నీ ఇగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఘుమఘుమలాడే కిచిడీ రెడీ.