Threatening Letter to Rahul Gandhi at Indoor in Madhyapradesh: రాహుల్ గాంధీపై బాంబులేసి చంపేస్తామంటూ ఆగంతుకులు రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. భారత్ జోడో యాత్రలో బిజీబిజీగా గడుపుతున్న రాహుల్.. తన పాదయాత్రలో సామాన్య ప్రజలను కలుస్తూ, వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతుంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని జుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఓ స్వీట్ షాపు వద్ద రాహుల్ గాంధీపై బాంబు వేసి చంపేస్తాం అని చేతి రాతతో ఉన్న లేఖ (Threatening Letter) లభ్యం అయ్యింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు, సమీపంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ తండ్రి, రాజీవ్ గాంధీని మానవ బాంబులతో హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొని, జీవిత ఖైదు శిక్ష ఖరారు అయిన నళిని ఇటీవలే సుప్రీం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ రాహుల్‌కు ఇటువంటి బెదిరింపులు రావటం పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.