Startup for Funeral at mumbai : మారుతున్న జీవన ప్రమాణాలలో కుటుంబాలు కూడా చేరాయి. ఇంతక ముందు పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి మంచైనా.. చెడు అయినా అందరూ కలిసి ఉండేవారు. కాల క్రమేణా పెద్ద కుటుంబాల కోసం కేవలం పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఏదైనా జరగకూడనది జరిగి.. మననిషి భౌతికంగా దూరమైతే.. అంత్యక్రియలకు మహా అయితే రక్త సంబంధీకులు మాత్రమే వస్తున్నారు ఈ రోజుల్లో. దీనివల్ల అంత్యక్రియలు సవ్యంగా జరగకపోవటం, సమయానికి చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు. ఈ ఇబ్బందినే వ్యాపారంగా మార్చుకొని ఒక స్టార్టప్ కంపెనీని పెట్టారు.
ఎంత బాగా బతికామన్నది కాదు, ఎంత బాగా మరణించామన్నదే ముఖ్యం అన్న ట్యాగ్ లైన్‌తో అంకుర పరిశ్రమను స్థాపించారు. ఈ అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా కొన్ని ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఒక్కో సాంప్రదాయ ప్రకారం, ఒక్కో విధంగా అంత్యక్రియలు జరుపుతుంటారు. అయితే ఇలా కాంట్రాక్ట్ బేస్‌పై అంత్యక్రియలు చేసే కంపెనీలు విదేశాల్లో చాలా ఉన్నాయి.. కానీ భారతదేశంలో మాత్రం ఇటువంటివి అస్సలు లేవు. వ్యక్తి మరణిస్తే.. రకరకాల ఫ్రీజర్లను అందించే సంస్థలు అయితే ఉన్నాయి.. కానీ అంత్యక్రియల వరకు తంతు మెుత్తాన్ని నిర్వహించే కంపెనీలు మాత్రం లేవు.
ఆ ఇబ్బందిని గమనించే.. సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ (Startup for Funeral) కంపెనీ వచ్చిందని నిర్వాహకులు వివరించారు. ఇది ముంబైకి చెందిన స్టార్టప్ కంపెనీ. ఈ స్టార్టప్ మరణానంతరం చేయాల్సిన ఆచారా వ్యవహారాలన్నింటినీ.. దగ్గరుండి చూసుకుంటుంది. షామియానా, కుర్చీలు నుంచి శ్మశానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయటం.. అనంతరం నదిలో అస్తికలు కలిపే వరకు ప్రతి ఒక్క పనిని దగ్గరుండి చూసుకుంటుంది. అంతేకాకుండా.. డెత్ సర్టిఫికేట్ అందించే వరకు అంతా బాధ్యతగా తన పనులన్నీ దగ్గరుండి చేస్తుందీ ఈ సంస్థ.
ముంబై వంటి మహానగరాల్లో తమ సేవలు ఎంతో అవసరం అని ఈ సంస్థ చెప్తుంది. చాలా మంది ప్రజలు ఒంటరి జీవితాన్ని గడపటం, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారనీ.. అటువంటి వారికి సుఖాంతమైన అంత్యక్రియలు కూడా ఒక గౌరవం లాంటిదని.. ఆ గౌరవాన్ని తమ కంపెనీ తరఫున చేస్తామని చెప్తున్నారీ సంస్థ ప్రతినిధులు. 38 వేల రూపాయల నుంచి తమ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. మరణించటానికి ముందే.. మన అంత్యక్రియలు ఎలా సాగాలో మనమే నిర్ణయించుకుని.. అందుకు తగ్గ ప్యాకేజీ కూడా తీసుకోవచ్చునని వివరిస్తోంది సుఖాంత్ ఫ్యూనరల్ మేనేజ్‌మెంట్ కంపెనీ..