Pawan Kalyan cheques distribution to Ippatam villagers:ఇప్పటం.. మెున్నటి వరకు ఆ పరిసర ప్రాంతాల వారికి తప్ప.. ఎవరికీ తెలియదు. కానీ, రోడ్డు విస్తరణలో కొందరు ఇళ్లు కోల్పోవటం, అది కాస్తా రాజకీయ రంగు పులుముకోవటంతో.. ఒక్కసారిగా ఇప్పటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఇప్పటంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు పవన్ కల్యాణ్ ఇళ్లు కోల్పోయిన వారికి మంగళగిలోని పార్టీ కార్యాలయంలో చెక్కులను అందజేయనున్నారు.
ఇళ్లను కూల్చివేయటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ధర్మాసనం విచారణ చేసింది. అయితే ముందుగానే అధికారులు నోటీసులు ఇచ్చినా.. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. కానీ అధికారులు నోటీసులు ఇచ్చినా, ఇవ్వలేదని కోర్టును తప్పుదోవ పట్టించి, మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవటం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషనర్లకు లక్ష చొప్పున జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో పవన్ చెక్కులు అందించటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని, ఇప్పటికైనా జనసేన అధినేత (Pawan Kalyan) డ్రామాలు మానేయాలని వైసీపీ నేతలు హితువు పలికారు. పవన్ పర్యటన అడ్డుకునేందుకు అటు వైసీపీ ఆలోచనలో ఉంటే.. వారికి ధీటుగా సమాధానం చెప్పేందుకు జనసైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పటంలో నేడు ఏం జరగనుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.