Pawan Comments On Ycp party: ఇప్పటంలో ఇళ్లు కూల్చి తన గుండెల్లో గునపం దింపారని జనసేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహరం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే ఏం చేయాలో నాకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం. 2024లో జనసేన అధికారంలోకి వచ్చాక లీగల్ విధానంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లు కూలుస్తాం. వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతాం.’’ అని సవాల్ చేశారు.
పద్ధతి లేకుండా ఇళ్లు కూల్చేశారు
పద్ధతి లేకుండా ఇప్పటంలో ఇళ్లు కూల్చేశారని, ఒట్టేసి చెబుతున్నా… ఓట్లు వేసినా వేయకపోయినా నేను మీకు అండగా నిలబడతానని ఇప్పటం ప్రజలకు భరోసా ఇచ్చారు. వైసీపీ సజ్జల, వైసీపీ నేతలది ఆధిపత్యపు అహంకార ధోరణి అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ గడప కూల్చేదాక వదిలిపెట్టమని.. ఇళ్ల కూల్చివేత కక్షతోనే చేశారని మండిపడ్డారు. ఈ కూల్చివేతల వెనక సజ్జల పాత్ర ఉందని.. సజ్జల ఒక డిఫ్యాక్టో సీఎం అని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇప్పటం ప్రజల తెగింపు అమరావతి రైతులు కూడా చూపించి ఉంటే, రాజధాని కదిలేది కాదని Pawan Kalyan అన్నారు.
చంపేస్తామని బెదిరించారు
‘‘వైసీపీకి ప్రభుత్వనికి 175కి 175 సీట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు నోట్లో వేలు పెట్టుకుని కూర్చోలేదు. ఒకసారి అవకాశం ఇచ్చారు. 151 సీట్లలో గెలిపించారు. నన్ను ఇష్టపడే అభిమానులు కూడా వైసీపీకే ఓట్లేశారు.’’ అలా ఓట్లేయడం వల్లే ఈరోజు ప్రభుత్వం మన గడపలు కూల్చింది. ఇంకోసారి వేయండి మిగతా గడపలు కూలుస్తారు. నా కుటుంబన్ని చంపేస్తామని బెదిరించారు. అయినా తట్టుకుని నిలబడ్డా. ఎందుకు?..భవిష్యత్ బాగుండాలంటే ఒకడు తెగించాలి. ఆశయం కోసం పోరాడుతూ ప్రాణాలు పోతే అంతకు మించిన సంతోషం నాకు లేదు. అని (Pawan Comments On Ycp)పేర్కొన్నారు.
నా యుద్ధం నేనే చేస్తా
నేను ఇక్కడ పుట్టినవాడ్ని.. ఇక్కడే తేల్చుకుంటా. నా యుద్ధం నేనే చేస్తా. నేను మీలాగా ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పను. మోదీని ఎప్పుడు కలిసినా దేశ భవిష్యత్, ప్రజల రక్షణ గురించే మాట్లాడుతాను. వైసీపీని దెబ్బ కొట్టాలంటే మోదీకి చెప్పి చేయను. నేనే చేస్తా. అడ్డదారులు తొక్కను. అవినీతికి పాల్పడను అని స్పష్టం చేశారు.