YS Sharmila arrested panjagutta:గత రెండు రోజులుగా తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసను చేస్తున్నారు. ఇందులో భాగంగా షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆమె కాన్వాయ్ బస్సుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు మంట పెట్టటంతో, ఈ వివాదం మరింత ముదిరింది. నిన్న టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసం అయిన కారులోనే, భారీ కాన్వాయ్‌తో ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు నేడు షర్మిల ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆమెను సోమాజిగూడ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల, కారులో నుంచి దిగటానికి నిరాకరించారు. డోర్ లాక్ చేసుకొని కారు లోపలే ఉండిపోయారు. అప్పటికే సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో.. షర్మిల (YS Sharmila) కారులో ఉండగానే.. క్రేన్ సాయంతో కారును లిఫ్ట్ చేసి.. స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు కారును క్రేన్ సాయంతో తరలించి.. అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచారు. అనంతరం షర్మిలను పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారు. ఓ పక్క భారీగా వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, ముఖ్య నేతలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవటంతో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది