Vizag citizens died in Accident at Odisha: వారంతా తమతమ వృత్తుల్లో రాణిస్తున్నవారే.. వివిధ రాష్ట్రాల్లో తమ ప్రతిభను కనబరుస్తూ, పేరు తెచ్చుకున్నవారే.. కానీ ఓ ప్రమాదం.. ఆ నలుగురి జీవితాలను తలకిందులు చేసింది. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై జంకియా పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని బోడోపోకోరి గ్రామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు వదిలారు. ఈ నలుగురూ కూడా విశాఖకు చెందినవారే కావటంతో నగరంలో తీవ్ర విషాదం నెలకొంది.
విశాఖ నగరం ఎండాడకు చెందిన బ్యుటీషియన్ మరియాఖాన్ (24), విశాలాక్షినగర్‌కు చెందిన స్టిల్ ఫొటోగ్రాఫర్ రాకేష్‌కుమార్ అలియాస్ రాఖీ (35), ఎండాడకు చెందిన ఫొటోగ్రాఫర్ కబీర్ (28), మరియాఖాన్ సహాయకురాలు లక్ష్మీ (28) పూరీలో జరగనున్న పెళ్లికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని బోడోపోకోరి వద్ద మరమ్మతులు గురై, రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని.. వీరు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. (Vizag citizens died in Accident) అతి వేగం, మంచు కురుస్తుండటంతో రోడ్డు సరిగ్గా కనిపించకపోవటం ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
పేరున్న బ్యూటీషియన్.. శిక్షణ ఇస్తుంది
మరియాఖాన్‌కు బ్యూటీషియన్‌లో మంచి పేరుంది. పెద్దపెద్ద ఈవెంట్స్‌లో మేకప్ కాంట్రాక్టులు తీసుకునేది. ఇతర రాష్ట్రాల్లో సైతం జరిగే వేడుకల్లో మేకప్ వేస్తూ, అక్కడ వారి అభిరుచికి తగ్గట్లు ముస్తాబు చేస్తూ, మంచి పేరు తెచ్చుకుంది. విశాఖ బీచ్ రోడ్డులోని పాండురంగాపురంలో కుటుంబం ఉంటుంటే.. మరియాఖాన్ మాత్రం, ఎండాడలో ఓ అపార్ట్‌మెంట్ల్‌లో ఉంటుంది. పాండురంగాపురంలో బ్యూటీపార్లర్ నడుపుతూ, బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇస్తుండేది. మృతిచెందిన ఫోటోగ్రాఫర్ కబీర్ ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వాడు. ఆంధ్రాయూనివర్సిటీలో చదువుకొని, ఇక్కడే ఉంటున్నాడు.