Information and secret behind edu varala nagalu or 7 weeks jewellery: మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మా బామ్మకి ఏడు వారాల నగలుండేవట అని అంటుంటేనో, సినిమాలో మా అత్తగారు పెళ్ళైన కొత్తల్లో నాకు ఇచ్చిన ఏడు వారాల నగలు అని కోడళ్ళకు చూపిస్తుంటేనో ఈ ఏడు వారాల నగల గురించి వింటూ ఉంటాం. అయితే ఈ జనరేషన్ కే కాదు అమ్మల జనరేషన్ లో కూడా చాలామందికి ఈ ఏడు వారాల నగల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి ట్రెండ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్, జ్యువెలరీ ధరించడంలో మార్పులు వచ్చేశాయి. అయినప్పటికీ ఈ ఏడు వారాల నగలు ఎలా ఉంటాయో చూడకపోయినా కనీసం తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఉండే ఉంటుంది.
మరి ఇప్పుడు మనం ఏడు వారాల నగలు(Edu Varala Nagalu) అని ఎందుకంటారో తెలుసుకుందాం. ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాలు మాదిరిగా పూర్వం బంగారు నగలు ధరించేవారు. ఈ బంగారు ఆభరణాలను స్త్రీలు వారం రోజులూ ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం, ఆరోగ్యం కోసం ధరించే వారు. వాటినే ఏడువారాల నగలు అనే వారు. ఏయే రోజు ఎలాంటి నగలు ధరించేవారో కింద వివరంగా ఉంది.
ఆదివారము: సూర్యుని అనుగ్రహం కోసం కెంపులతో డిజైన్ చేసిన కమ్మలు, హారాలు మొదలైనవి ధరించేవారు.
సోమవారము: చంద్రుని అనుగ్రహం కోసం ముత్యాల హారాలు, ముత్యాల గాజులు ఇలా ముత్యాలతో చేసిన ఆభరణాలు ధరించేవారు.
మంగళవారము: కుజుని అనుగ్రహం కోసం పగడాల గొలుసులు, పగడాల ఉంగరాలు వంటి నగలు ధరించేవారు.
బుధవారము: బుధుని అనుగ్రహం కోసం పచ్చల పతకాలు, పచ్చలు అమర్చిన గాజులు తొడిగేవారు.
గురువారము: బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగము ఉన్న కమ్మలు, ఉంగరాలు మొదలైనవి ధరించేవారు.
శుక్రవారము: శుక్రుని అనుగ్రహం కోసం వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక, వజ్రాలు ఉన్న కమ్మలు మొదలైనవి ధరించేవారు.
శనివారము: శనిదేవుని అనుగ్రహం కోసం నీలమణి హారాలు మొదలైనవి వేసుకునేవారు.
ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలు సిద్దించేలా గ్రహాల అనుకూలత ఉంటుందని మన పూర్వీకులు భావించేవారు. ఆ కాలంలో మన దేశంలో వజ్ర, కనక, వైడూర్యాలు చాలా చౌకగా లభించేవట. అందుకే పేద ధనిక అనే తేడా లేకుండా స్త్రీలంతా తమ తాహతకు తగినట్టు ఏడు వారాల నగలు చేయించుకునేవారట. ధనికులైతే ఎక్కువ డిజైన్లలో ఎక్కువ నగలు ఆభరణాలు చేయించుకునేవారు. పేదవారైతే ఒక్కోరోజుకి ఒక్కో సెట్ ఉండేలా నగలు చేయించుకునేవారని పెద్దలు చెబుతుంటారు.