Minister Nirmala Sitharaman VS Revanth Reddy fight in Lok Sabha: లోక్ సభలో సోమవారం రూపాయి పతనంపై వాడీవేడీ వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు మధ్య వాగ్వాదం జరిగింది. డాలర్ తో రూపాయి విలువ అంశంపై చర్చ జరుగుతున్న క్రమంలో రేవంత్ రెడ్డిపై నిర్మల పరోక్షంగా సెటైర్లు వేశారు. తెలంగాణ నుంచి వచ్చి హిందీలో సరిగ్గా మాట్లాడటం రాని వ్యక్తికి తాను హిందీ భాషలోనే సమాధానం చెబుతానని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆమె వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి అనూహ్య రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు సరికావన్న ఆయన.. తాను శూద్రుడినని, తనకు స్వచ్ఛమైన హిందీ రాదని అన్నారు. అలాగే నిర్మలా సీతారామన్ బ్రాహ్మణవాది అని, ఆమెకు స్వచ్ఛమైన హిందీ వచ్చని కౌంటర్ ఇచ్చారు.
అయితే రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఈ దేశంలో ఎవరైనా ఏ భాషనైనా మాట్లాడవచ్చని, నిర్మలా సీతారామన్ హిందీయేతర భాషలు మాట్లాడే వారిపై బలవంతంగా హిందీని రుద్దడం ఆపాలని సూచించారు. మీరు అవమానించింది కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే కాదని తెలుగు మాట్లాడే వారితో పాటు దేశంలోని హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలను అవమానిస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది టీ కాంగ్రెస్. కాగా ఈ రోజు లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకూ రూపాయి విలువ పతనం అవుతుంటే మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. గతంలో డాలర్ తో రూపాయి విలువ 69 కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ రూపాయి ఐసీయూలో పడిపోయిందని ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో 82 దాటిపోయిందని గుర్తు చేశారు. డాలర్ తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో వివరించాలని లోక్ సభ వేదికగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.