Prime Minister Modi expressed hope that India will host the Football World Cup: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా భాషలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘ఫుట్ బాల్లో ఎవరైనా క్రీడ నియామకాలకు విరుద్ధంగా ఆడితే రెడ్ కార్డ్ ఇస్తారు. అదే విధంగా గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఈశాన్య భారతదేశం లోని అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు రెడ్ కార్డ్ ఇచ్చిందని పేర్కొన్నారు’. ఏదో ఒక రోజు దేశం కూడా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అతిథ్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 ముందు వరకు ఈశాన్యంలో వారానికి 900 విమానాలు నడిచేవని, అయితే తమ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఆ సంఖ్య 1,900కి చేరిందని తెలిపారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధిలో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సహకారాన్ని కొనియాడారు మోడీ. ఈ స్వర్ణోత్సవ వేడుకలు.. కొనసాగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌తో సమానంగా జరుగుతున్నాయని అన్నారు. తాను ఈ ప్రాంతంలోని 8 రాష్ట్రాలను అష్టలక్ష్ములు గా తరచుగా సంబోధిస్తున్నానని, వీటి అభివృద్ధికి ప్రభుత్వం 8 ప్రాథమిక స్తంభాలపై కృషి చేయాలని సూచించారు. శాంతి, శక్తి, పర్యాటకం, 5జీ కనెక్టివిటీ, సంస్కృతి, సహజ వ్యవసాయం, సంస్కృతి, క్రీడా సామర్ధ్యం వంటి అంశాలను 8 ప్రాథమిక స్తంభాలుగా పేర్కొన్నారు. ఆగ్నేయాసియాకు ఈశాన్య ప్రాంతం ముఖ ద్వారమని, మొత్తం ప్రాంత అభివృద్ధికి కేంద్రంగా మారగలదని ప్రధాన మంత్రి అభిలషించారు. భారతదేశం-మయన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారి, అగర్తల-అఖౌరా రైలు ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 4జీ మొబైల్ టవర్లను జాతికి అంకితం చేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.7 లక్షల కోట్లను మౌళికసదుపాయాల కోసం కేంద్రం వెచ్చించిందని చెప్పారు. 8 ఏళ్ల క్రితం ఇది రూ.2 లక్షల కోట్ల లోపే ఉందని పేర్కొన్నారు. కాగా షిల్లాంగ్ లో రూ.2,450 కోట్ల బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు.