KCR New Strategy to Expand BRS Party In AP: TRS పార్టీ BRS పార్టీగా మారిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జాతీయస్థాయిలో బీజేపీకి ఎదురు నిలబడే శక్తిగా బీఆర్ఎస్ ని బలపరచేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రాష్ట్రాల వారీగా బీఆర్ఎస్ ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పక్క రాష్ట్రమైన ఏపీలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు షురూ చేశారు. ఇక ఆ బాధ్యతలను పార్టీకి చెందిన ఓ మంత్రికి అప్పగించారని టాక్. ఇక ఆలస్యం లేకుండా ఏపీకి చెందిన కీలక నేతల్ని సైతం తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలతోనూ ఆయన భేటీ అవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన బీసీ నేతలు కేసీఆర్ ను కలవడం చర్చనీయాంశం అయింది. వీరంతా ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని కేసీఆర్ కి హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి పార్టీల మధ్య పొత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి చెందిన బీసీ నేతలు కేసీఆర్ తో భేటీ అవడం రకరకాల ఊహాగానాలకు తెరలేపుతోంది.
అయితే ఏపీలో బీఆర్ఎస్ పోటీపై పార్టీ అధిష్టానం నుండి క్లారిటీ రాలేదు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉంటే పోటీ చేసుకోవచ్చని, పొత్తుపై మాత్రం తుది నిర్ణయం తమ అధినేత జగన్ తీసుకుంటారని వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టి చెప్పారు. మరో వైపు చంద్రబాబు తెలంగాణ గడ్డపై ఫోకస్ పెంచిన వేళ కేసీఆర్ ను రెండు జిల్లాలకు చెందిన నేతలు, అందులోనూ బీసీ సామాజిక వర్గాల నేతలు వచ్చి కలిసి వెళ్లడంతో ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. వైసీపీ, కేంద్ర ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ, బీజేపీ పెద్దలపై నిప్పులు చెరుగుతున్న కేసీఆర్.. ఏపీలో పార్టీని విస్తరించేందుకు బీసీ కార్డు ఉపయోగించబోతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ కు సంబంధించిన వ్యవహారాలను సైతం ఓ బీసీ మంత్రికే అప్పగించారనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఎవరికి చెక్ పెట్టబోతున్నారు? మరెవరిని చేరదీయబోతున్నారు? అనే అంశాలు రాజకీయంగా ఉత్కంఠకు దారితీశాయి.