Rishabh Pant Out of IPL 2023: ఐపీఎల్ మరో మూడు నెలల్లో ప్రారంభమవనుండగా ఢిల్లీ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టీం కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రిషబ్ తీవ్రంగా గాయపడడంతో ఈసారి ఐపీఎల్ కు దూరం కానున్నాడు. రిషబ్ ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రిషబ్ నుదురు చిట్లిపోవడం, మోకాలి లిగమెంట్ తెగిపోవడం, వీపు భాగంలో కాలడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ పూర్తిగా కోలుకునేందుకు 3 నుండి 6 నెలల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. తీవ్ర గాయాలు కావడంతో పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అతడు పూర్తిగా కోలుకోవడానికి 6 నెలలు పట్టొచ్చని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరో 3 నెలల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుండగా.. పంత్ అప్పటివరకు కోలుకునే ఛాన్స్ లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పంత్ ఐపీఎల్ సీజన్ 16 మొత్తానికి దూరం కానున్నాడు. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని కసితో ఉన్న ఢిల్లీకి.. కెప్టెన్ పంత్ దూరం కావడం భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అంతేకాకుండా పంత్ టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య భారత్లో జరిగే టెస్ట్ సిరీస్ కు సైతం దూరం కానున్నాడు. ఎవరు అతని ప్లేస్ ను భర్తీ చేస్తారో చూడాల్సిందే మరి.