Amazon Layoffs to Hit Over 18,000 Workers: ఐటీ రంగాన్ని రెసిషన్ ఆందోళన కలిగిస్తోంది. వివిధ సంస్థల్లో ఉద్యోగుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తాజాగా ఆ సంఖ్యను 18,000కు పెంచింది. ఇందులో కొన్ని తొలగింపులు భారత్‌లోనూ ఉండనున్నాయని, ఈ నెలాఖరులో దీనిపై స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ తన వార్షిక ప్రణాళికలో వెల్లడించారు. గత నవంబర్‌లో అమెజాన్ సంస్థ 10 వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించింది. అందులో 200 నుండి 300 మంది భారత్‌లోని ఉద్యోగులున్నారు.
కరోనా సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టామని, ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునేందుకు కొంతమందిని తీసేయక తప్పట్లేదని ఉద్యోగులకు పంపిన లేఖలో ఆండీ జెస్సీ పేర్కొన్నారు. అయితే, కంపెనీ చరిత్రలోనే ఈ స్థాయి ఉద్యోగుల తొలగింపులు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. తీసేయబడిన ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని, 5 నెలల జీతంతో పాటు ఆరోగ్య బీమా, ఇతర ఉద్యోగాలను వెతుక్కునేందుకు సహాయం అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ తొలగింపుల ప్రక్రియ కొన్ని నెలల వరకు జరుగుతుందని, అన్ని విభాగాల్లో సరైన పరిశీలన తర్వాతే ఇది పూర్తవుతుందని జెస్సీ వెల్లడించారు. ఈ-కామర్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం అవుతారని సమాచారం. అయితే, నవంబర్‌లో ప్రకటించిన తొలగింపుల్లో కొందరిని పూర్తిగా తీసేయలేదని, వారిని కూడా ఈసారి జాబితాలో చేర్చినట్టు స్పష్టం చేశారు. కాగా, 2022, సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో 15.40 లక్షల మంది ఉద్యోగులున్నారు.