TSPSC Case |టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ ను జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగు చూసాయి. ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు రమేష్ ద్వారా మొత్తం 40 మందికి చేరినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో సిట్ అధికారులు ఆ 40 మంది కోసం వేట మొదలు పెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు(TSPSC Case)లో సిట్ అధికారులు ఇటీవల వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డీఈగా పనిచేస్తున్న రమేష్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశోక్ నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రమేష్ పరీక్షలకు ముందే పదకొండు మంది అభ్యర్థులతో డీల్ కుదుర్చుకున్నట్టు వెళ్లడయ్యింది. ఒక్కొక్కరితో 20 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని అడ్వాన్స్ గా డబ్బు కూడా తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత హైటెక్ పద్దతిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడి మాస్ కాపీయింగ్ కూడా జరిపించినట్టు తేలింది. తాజాగా రమేష్ నుంచి ప్రశ్నాపత్రాలు 40 మందికి చేరినట్టు వెల్లడి కావటంతో సిట్ అధికారులు వారి కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు మొదలు పెట్టారు.