ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి అమరవీరుల స్థూపాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. అందుకే నిర్మాణాల్లో క్వాలిటీ లేదని అన్నారు. అమరుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్‌ను బాటా చెప్పుతో కొట్టినా తప్పులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, ‘దశాబ్ది దగా(Dashabdi Daga)’ పేరుతో నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని ఖండించారు. పోలీసులతో కేసీఆర్ రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారని తెలిపారు. హజ్ యాత్రికులను పంపడానికి వెళుతున్న షబ్బీర్ అలీ(Shabbir Ali)ని గృహ నిర్బంధం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తు చేయాలి.. కానీ, అమరుల త్యాగాలను కేసీఆర్(KCR) రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకున్నారని విమర్శించారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అప్పుడు బీఆర్ఎస్ అక్రమాలను వెలికి తీస్తామని రేవంత్(Revanth Reddy) అన్నారు.