పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్‌లో కొనసాగారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ మధ్యే మళ్లీ సినిమాలు చేస్తున్నారు. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాలు పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే, రాజకీయాలూ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు చేస్తున్నారు. అదేవిధంగా సముద్రఖని(Samuthirakani) దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమా లో నటిస్తున్నారు
ఇందులో బ్రో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. జులై 28న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు సముద్రఖని(Samuthirakani) ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని దగ్గర నుంచి చూసి, ఆయనతో ట్రావెల్ చేసే అవకాశం రావడం అదృష్టమని వెల్లడించారు. పవన్ కల్యాణ్ స్టేట్ లీడర్ కాదని, ఆయన నేషనల్ లీడర్ అని చెప్పుకొచ్చారు. ఆయన ఏం చేసినా ఒక విజన్‌తో చేస్తారని, దాని ఫలితం ఇప్పటికిప్పుడే అర్ధం కాదని, ఏదో ఒకరోజు ప్రజలు ఆయన గొప్పతనం తెలుసుకుంటారని అభిప్రాయపడ్డారు.