ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకునే వారికి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా వేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడవద్దని, ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం చైతన్యం రావడం లేదు. హెల్మెట్ లేకుండా భుజంపై ఫోన్ పెట్టుకుని చెవికి ఆనించి మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారిని చాలా మందిని చూశాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెనుక నుండి హారన్ పట్టించుకోకుండా డ్రైవ్ చేసే వారు కూడా ఉన్నారు. ఇలా బాధ్యతరాహిత్యంగా డ్రైవ్ చేస్తూ ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారు. అయినప్పటికీ జనాల్లో మాత్రం చలనం రావడం లేదు. రూల్స్ బ్రేక్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఎన్నో యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు.
ఈ నేపథ్యంలోని ఏపీ ప్రభుత్వం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త ట్రాఫిక్ రూల్ ను ప్రవేశపెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇకపై ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా వేయనుందని సమాచారం. రూల్స్ బ్రేక్ చేసే వారికి బ్రేకులు వేసేందుకు భారీగా జరిమానాలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్(AP Govt) తీసుకున్న నిర్ణయంతో అలాంటి వాహన చోదకుల్లో ఇకనైనా మార్పు వస్తుందేమో చూడాలి.