Jammu Kashmir | జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కుల్గాంలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Jammu Kashmir | ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మరణించారని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న చినార్ కార్ప్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు సైనిక బలగాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు.