మందుబాబుల తీరు మారడం లేదు. పోలీసులు, ప్రభుత్వాలు మద్యం తాగి వాహనాలు నడపవొద్దని ఎంత ప్రచారం చేసినా చెవికెక్కడం లేదు. తప్ప తాగి ఆ మత్తులో అతి వేగంతో వాహనాలు నడుపుతూ వీరంగం సృష్టిస్తున్నారు. వారితో పాటు అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా విశాఖ(Vizag)లో మందుబాబుల దెబ్బకు దంపతులతో పాటు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వైజాగ్‌లో రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. మంగళవారం బీచ్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్‌కు ముగ్గురు బలయ్యారు. మద్యం మత్తులో అతి వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో భార్యభర్తలు సహా మరొకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆరిలోవా పీఎస్ పరిధిలో ర్యాడిసన్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు నడిపిన యువకుడిని వినయ్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే ఈ నెల 2న విశాఖ వీఐపీ రోడ్డులో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చిన కారు.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అతి వేగంతో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి రోడ్డుపై హల్‌చల్ చేసింది. వీఐపీ రోడ్డులో ఉన్న బార్‌లో ఆమెతో పాటు మరికొంతమంది యువకులు పీకలదాగా తాగేసి బీభత్సం సృష్టించారు. మత్తు నెత్తికెక్కడంతో అతి వేగంగా కారు డ్రైవ్ చేయడంతో అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. పెద్ద శబ్ధంతో వాహనాలను ఢీకొట్టడంతో.. అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతో పాటు కారులో ఉన్న యువకులు.. అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అంతకుముందు కూడా నగరంలో మరో ప్రమాదం జరిగింది. లాసన్స్ బే కాలనీ దగ్గర కారుతో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. కారులో నలుగురు యువతులను ఎక్కించుకొని ర్యాష్ డ్రైవింగ్(Rash Driving)తో రెచ్చిపోయాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇలా వరుస ఘటనలతో వైజాగ్(Vizag) వాసులు హడలిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు తలెత్తకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడపాలంటేనే భయపడేలా చేయాలని కోరుతున్నారు.