త్తరాంధ్ర యువతకు ఉద్యోగాల్లేవని, జాబ్ క్యాలెండర్ లేదని.. కానీ వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ మాత్రం యథేచ్ఛగా సాగిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.
ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి నియోజకవర్గం విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. కేవలం భూముల మీదే ప్రేమ అన్నారు. కొండలను పిండి చేయడంతో పాటు ప్రభుత్వ భూములు, రైతుల భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలోనూ ఇలాగే భూములు దోచేస్తే తన్ని తరిమేశారని తెలిపారు. సీఎంగా ఉంటూ జగన్ చేసే అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. అడ్డగోలు అక్రమాలకు జగన్, రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దళితులకు ఇచ్చిన భూముల్లో రోడ్లు ఎలా వేస్తారు? అని నిలదీశారు. అడ్డగోలుగా భూములను దోచేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారని పవన్ నిలదీశారు. ఇక్కడ ఉన్న 600 ఎకరాలు భూములను కబ్జా చేసి 13వేల కోట్ల రూపాయలతో అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక్కడ సరైన దారి లేదని.. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను కాదు.. సీఎంనే అడుగుతున్నా.. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకమని పవన్ ప్రశ్నించారు.