తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం వారాహి యాత్ర మూడో విడత జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖ, గాజువాక నగరాల్లో బహిరంగ సభలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా.. పవన్ కల్యాణ్ ఆరోపణలకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ హింసను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఒక ప్లాన్ ప్రకారమే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.
ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారని ఆరోపించారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్ప పవన్ కల్యాణ్ స్పీచ్‌లో ఏముందని ప్రశ్నించారు. ఏదో పిచ్చి కేకలు వేస్తే అభిమానులు ఈలలు వేయడం కామనేనని అన్నారు. పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలు సందర్భరహితం, అప్రస్తుతం అని మండిపడ్డారు. అందుకే ఆయన మాట్లాడిన అంశాలపై తాను స్పందించడం లేదని చెప్పారు. అధికారంలోకి రావాలనే ఆలోచన పవన్ కల్యాణ్‌కు లేదని.. చంద్రబాబుకు అధికారం రావడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఆయన పాపులారిటీని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.