స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. మంగళవారం గోల్కొండ కోటలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం పాల్గొని జెండావిష్కరణ చేశారు. అనంతరం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకుల చేతిలో తెలంగాణ అవమానానికి, అసమానతలకు గురైందని ఆవేదన చెందారు. తెలంగాణ రాకముందు మనం ఎంత మోసపోయామో ఈ పదేళ్లలో ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దుఖం వస్తుందని కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
నాడు ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాక్‌కో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు కనిపించేవారు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో తెలంగాణను సాధించుకొని అద్భుతంగా పునర్నిర్మాణం చేసుకున్నామని అన్నారు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా నా ప్రజలను నేను కాపాడుకుంటానని సీఎం చెప్పారు.