Congress Working Committee | త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్, ఆ వెంటనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి నూతన కార్యవర్గాన్ని హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Karge) ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ కమిటీలో 39 మందిని సభ్యులుగా నియమించారు. సీడబ్ల్యూసీ కార్యవర్గంలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.
గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై ముభావంగా ఉంటున్న ఆనంద్ శర్మ, శశిథరూర్, సచిన్ పైలట్ సహా పలువురు జీ-23 నేతలకు కూడా వర్కింగ్ కమిటీలో చోటు ఇచ్చారు. ఈ కమిటీలో ఏపీ నుంచి రఘువీరా రెడ్డికి చోటు కల్పించగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. సీడబ్ల్యూసీ(Congress Working Committee) శాశ్వత ఆహ్వానితులుగా 18 మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డి ఉన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా 9 మందిని ఎంపిక చేశారు. ఈ లిస్టులో పల్లం రాజు , చల్లా వంశీచందర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. 14 మందిని సీడబ్ల్యూసీ ఇంఛార్జిలుగా నియమించారు. సీడబ్ల్యూసీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా నలుగురిని నియమించారు.