ఎప్పుడో ఒకసారి వ్యాధుల బారినపడటం సహజం. కానీ తరచూ దీర్ఘకాలిక వ్యాధులతో(Chronic Diseases) బాధపడటం మాత్రం ప్రమాదకరమని, ఇది ఆయుష్షు తగ్గడానికి కారణం అవుతుందని అమెరికన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ డేటా సైన్స్ అధ్యయనంలో వెల్లడైంది. యూకేలో 25 శాతం కంటే ఎక్కువమంది పెద్దలు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు లాంగ్ టెర్మ్ హెల్త్ కండీషన్స్‌ను ఎదుర్కొంటున్నారు. వరల్డ్ వైడ్ ఈ దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం 65 ఏళ్ల వయస్సుగల వ్యక్తుల్లో 65 శాతం, 85 లేదా అంతకంటే ఎక్కువ వయస్సుగల వ్యక్తుల్లో 82 శాతం పెరుగుతోందని గుర్తించారు.
ముఖ్యంగా సైకోసిస్, డయాబెటిస్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కాలక్రమేణా డెవలప్ అవడం ఆయుర్దాయం క్షీణతకు దారితీస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. స్టడీలో భాగంగా 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 1.6 మిలియన్ల కంటే ఎక్కువ మంది 20 సంవత్సరాల వ్యవధిలో ఎదుర్కొన్న అనారోగ్యాలు, మరణాల డేటాను విశ్లేషించారు. జీవితంలో మూడు దీర్ఘకాలిక వ్యాధులను(Chronic Diseases) ఎదుర్కొనేవారిలో 10 నుంచి 13 సంవత్సరాల ఆయుష్షు తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. అయితే ఈ పరిస్థితి అన్ని దేశాల్లో ఒకే విధంగా లేదని, యూకేలోనే దీర్ఘకాలిక వ్యాధులు ఆయు క్షీణతకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు.