బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సీటు రాని సీనియర్లు అలకబూనారు. ఏ క్షణంలోనైనా బాంబ్ పేల్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అధిష్టానం అలర్ట్ అయింది. సీనియర్లను బుజ్జగించే పనికి శ్రీకారం చుట్టింది. పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)కు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ బాధ్యతను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao)కు అప్పగించింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని తుమ్మల ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. నామాతో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు(Bhaskar Rao) కూడా ఉన్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని తుమ్మలకు చెప్పినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా పాలేరు నుంచి పోటీ చేయడానికి తుమ్మల అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసుకున్నారు. అనుచరులుతో వరుస సమావేశాలు నిర్వహించి పోటీకి సిద్ధమయ్యారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న తుమ్మలతో అనుచరులు సమావేశమై బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తుమ్మలకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. మరి తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన తుమ్మల(Thummala Nageswara Rao).. తర్వాత పరిణామాలతో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2018లో పాలేరు నుంచి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.