ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం ఢిల్లీలో షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే షర్మిల పోరాటం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని వెల్లడించారు. కాగా, పార్టీ విలీనం, కాంగ్రెస్ లో చేరిక వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ.. షర్మిల కాంగ్రెస్ అగ్ర నాయకులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ప్రతిపాదన లేని సమయంలో కూడా షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని చెబుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను బరిలోకి దింపే యోచనలో ఉన్నారు. ఒకవేళ షర్మిల(YS Sharmila) పోటీ తెలంగాణలో కనుక అనివార్యం అయితే ఆమెను సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని టీ కాంగ్రెస్ యోచిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.