సౌత్ ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలకు కొరియోగ్రఫీ, దర్శకత్వం చేస్తూ, నటిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందాడు. ముఖ్యంగా తెలుగు తమిళం లో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరోవైపు లారెన్స్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. చిన్నపిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్లు వంటివి చేయిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ట్రస్ట్ కు పలువురు విరాళాలు ప్రకటించారు. తాజాగా.. విరాళాల ప్రకటనపై లారెన్స్ స్పందించారు.
తన ట్రస్ట్ కి ఎవరూ విరాళం ఇవ్వొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. తాను ట్రస్ట్ ప్రారంభించిన సమయంలో రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేసేవాడినని, ట్రస్ట్ ను నడిపించడానికి అవసరమయ్యే డబ్బు తన వద్ద లేకపోవడంతో వీలైన వారు సహాయం చేయాలని కోరానని తెలిపాడు. ప్రస్తుతం నేను సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాననీ, డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నాననీ.. అలాంటి సమయంలో ఇతరుల సహాయం లేకుండా ట్రస్ట్ కు అన్ని తానే అయి ముందుకు నడిపించాలని భావించానని తెలిపారు. ఇంతకుమించి మరే కారణంతోనూ తాను విరాళాలు ఇవ్వద్దు అంటూ చెప్పలేదని లారెన్స్(Raghava Lawrence) చెప్పారు. దీంతో నీది గొప్ప మనసు అన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.