అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ విచ్చేశారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో బైడెన్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండ్ అయింది. విమానం నుంచి దిగిన బైడెన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత జో బైడెన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్‌తో పాటుగా సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఇతర వైట్ హౌస్ ఉన్నతాధికారులు ఉన్నారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలను బైడెన్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం తన బీస్ట్ వాహనంలో ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు బయలుదేరారు. కాసేపు విశ్రాంతి అనంతరం ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
ఇప్పటికే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని అంటోని, జపాన్ ప్రధాని పుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఈజిప్ట్ ప్రధాని అబ్దుల్ ఫతా, ఇతర దేశాధినేతలు ఢిల్లీ చేరుకున్నారు.
ఇక శని, ఆదివారాలలలో జరిగే జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ సదస్సుకు భారత్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ తదితరులు హాజరవుతున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. వీరి తరఫున ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నారు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా రావడం లేదు.
జీ20 దేశాల్లో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యూకే, అమెరికా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఉంది.