ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు గురువారం కవితకు నోటీసులు అందించారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కాగా పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ కీలక వాదనలు వినిపించింది. కవిత విచారణకు హాజరు కావాల్సిందే అంటూ స్పష్టం చేసింది. కావాలంటే పది రోజులు గడువిస్తామని కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవిత పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
Delhi Liquor Scam | కాగా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్, కవితలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించి ఢిల్లీ మద్యం పాలసీని తమకు అనుకూలంగా తయారు చేయించుకుని అక్రమంగా లబ్ధి పొందారన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో ఆ సంస్థ గత మార్చి 16, 20, 21వ తేదీల్లో కవితను ఢిల్లీలో విచారించింది. అదే సమయంలోనే ఆమె మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు.. మహిళలను వారు నివసించేచోటే విచారించాలన్న సీఆర్పీసీలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని కోరారు.