డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు గట్టి షాక్ తగిలింది. డ్రగ్స్ కేసు నుంచి తనకు ఊరట కలిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 41ఏ సెక్షన్ కింద నవదీప్ కు నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. నిన్న నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో నవదీప్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు హైకోర్టు విన్నది. హీరో నవదీప్ పై గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయని పోలీసులు తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను నవదీప్ తరపు న్యాయవాది తోసిపుచ్చుతూ, ఆయన ఏ కేసులోనూ దోషిగా లేరని తెలిపారు. అనంతరం నవదీప్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయనకు 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులకు సూచించింది.
కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ హీరో నవదీప్ నివాసంలో మంగళవారం ఉదయం నార్కోటిక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అధికారులు సోదా చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన రాంచంద్ అనే వ్యక్తి నుంచి హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారులు నవదీప్ ను ఈ కేసులో 37వ నిందితుడిగా చేర్చినట్లు సమాచారం. కాగా నవదీప్ ను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. అయితే డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేయొద్దని హైకోర్టును నవదీప్ ఆశ్రయించాడు.